అసదుద్దీన్ ఒవైసీ విమర్శలపై విజయశాంతి ఫైర్‌

6 Jul, 2021 07:48 IST|Sakshi

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని ముస్లింలను ఉద్దేశించి ఆరెస్సెస్‌ ఛీఫ్‌ మోహన్ భగవత్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని తప్పుబడుతూ ఒవైసీ నిన్న ట్వీట్లు చేశాడు.  ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. 

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆమె..  ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం.

మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. 

అయితే భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి వరుస ట్వీట్లలో ఒవైసీని నిలదీశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు