గ్యాంగ్‌స్టర్ దూబే ఆత్మ : ప్రతీకారం తప్పదు!

16 Sep, 2020 12:34 IST|Sakshi

వికాస్ దూబే దెయ్యం అంటూ వణికిపోతున్న గ్రామస్థులు

వికాస్ దూబే  ఆత్మ  ప్రతీకారం తీర్చుకుంటుంది

శాంతి పూజలు నిర్వహిస్తాం

కొట్టిపారేస్తున్న స్థానిక పోలీసులు

కాన్పూర్ : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో హతమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఉత్తరప్రదేశ్‌, బిక్రూ గ్రామ ప్రజలు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒంటరిగా సంచరించాలన్నా ..ఆకు కదిలినా దూబే ఆత్మ వచ్చినట్టు గజగజ వణికిపోతున్నారు. రాత్రి అయిదంటే ఇళ్లలోకి వెళ్లి, తాళాలు వేసుకుని మరీ బతుకుజీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. దూబే ఎన్‌కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామ ప్రజలను తుపాకీ మోతల బీభత్సం ఇంకా వెంటాడుతోంది. వికాస్ భయ్యా దెయ్యమై తిరుగుతున్నాడని భ్రమపడుతున్నారు. దూబే ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమంటున్నారు. 

ఇప్పటికీ కూడా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు(ఆజ్ భీ గోలియోం కి ఆవాజ్ సునాయీ దేతి హై. సబ్ జాన్తే హై.. పర్ బోల్తా కోయి నహీ) అని గ్రామస్తులు ఆందోళనతో చెబుతున్నారు. కొంతమంది వికాస్ దెయ్యాన్ని కూడా చూశారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక యువకుడు తెలిపాడు. భయ్యా ప్రభుత్వం కూల్చివేసిన ఇంటి శిథిలాల మీద కూర్చుని ఉండటం చూశామనీ మరొకరు తెలిపారు. అక్కడ కూర్చుని నవ్వుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తన మరణానికి అతడు(దూబే)ప్రతీకారం తీర్చుకుంటాడని తమకు ఖచ్చితంగా తెలుసని గ్రామానికి చెందిన మరో వృద్ధుడు చెప్పారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆ ఇంటినుంచి మాటలు, మధ్య మధ్యలో నవ్వులు వినిపిస్తున్నాయని కూల్చివేసిన దూబే ఇంటి సమీపంలో నివసిస్తున్న మరో మహిళ పేర్కొంది.  (‘ఇందులో ఓ పొలిటికల్‌ థ్రీల్లర్‌ పాయింట్‌ ఉంది’)

మరోవైపు గ్రామస్తుల భయాలను, వాదనలను తోసిపుచ్చలేమని స్థానిక పూజారి చెప్పారు. అసహజ మరణాలు జరిగిన సందర్భాలలో, ఇటువంటి సంఘటనలు జరుగుతాయనీ, వికాస్ విషయంలో దహన సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేదనీ ఆయన వాదిస్తున్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా సంబంధిత పూజలు చేయాలని స్థానిక పూజారిని కోరినప్పటికీ, పోలీసుల దృష్టిలో పడటం ఇష్టం లేక పూజారి దీనికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు. అందుకే వికాస్ దూబే సహా, చనిపోయిన పోలీసుల ఆత్మశాంతి కోసం దసరా నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు. అయితే ఎన్‌కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామంలో విధుల్లో ఉన్న నలుగురు పోలీసులు (ఇద్దరు పురుషులు,ఇద్దరు మహిళలు) అలాంటివేమీ తాము వినలేదని, అంతా సవ్యంగానే ఉందని కొట్టి పారేశారు. కాగా గ్యాంగస్టర్, ఎనిమిది మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న నేరస్థుడు వికాస్ దూబేను ఎన్‌కౌంటర్‌ లో యూపీ పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు