‘వికాస్‌ ఇంజన్‌’ సామర్థ్య పరీక్ష విజయవంతం

23 Jan, 2022 04:15 IST|Sakshi
ఐపీఆర్‌సీలో వికాస్‌ ఇంజన్‌ దశను పరీక్షిస్తున్న దృశ్యం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్‌–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్‌ ఇంజన్‌ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 20న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ సెంటర్‌ (ఐపీఆర్‌సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మానవరహిత ఉపగ్రహాల ప్రయోగాన్ని నిర్వహించే ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలు పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.

ముందుగా క్రయోజనిక్, వికాస్‌ ఇంజన్ల పనితీరును, సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. గగన్‌యాన్‌–1 ప్రాజెక్ట్‌ కోసం వికాస్‌ ఇంజన్‌ అర్హతను నిర్ధారించేందుకు దీర్ఘకాలిక పరీక్ష అవసరం ఉందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు ముందుగా రాకెట్‌లోని ఇంధన దశలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గగన్‌యాన్‌–1 ప్రయోగాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెండు సార్లు వికాస్‌ ఇంజన్లను పరీక్షించారు. వికాస్‌ ఇంజన్‌ను 25 సెకన్ల పాటు మండించి ఇంజన్‌ పనితీరును పరీక్షించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు