-

ఆ కుటుంబంతో మాటల్లేవు, నీళ్లు ముట్టనివ్వరు

6 Mar, 2021 07:57 IST|Sakshi
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దాసపూర్‌   గ్రామ బాధిత కుటుంబీకులు

భువనేశ్వర్‌ : ఊళ్లో మంచినీరు కూడా ముట్టుకోనీయకండా గ్రామపెద్దలు విధించిన ఆంక్షల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలని బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రాను బాధిత కుటుంబం వేడుకుంది. గంజాం జిల్లా గొళంతరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల దాసపూర్‌ గ్రామంలో నివాసం ఉంటూ గ్రామ పెద్దల దండన అనుభవిస్తున్న డి.మోహన్‌ రావు, మల్లేశ్వర్‌ రావు, నాగేశ్వర్‌ రావులతో పాటు కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని బరంపురం ఎస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెందిన మహిళ దీక్షిత మాట్లాడుతూ రొంగాయిలొండా సమితి దాసపూర్‌ గ్రామంలో కొద్ది రోజుల క్రితం పంట పొలాలకు సాగునీరు విషయంలో ఇరు కుటుంబాల మద్య రగిలిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది.  

ఐదు రోజుల క్రితం గ్రామ పెద్దలు ఒక కుటుంబం వైపు కొమ్ముకాసి   తమ కుటుంబంపై పక్షపాత వైఖరి చూపించి గ్రామంలో మంచి నీరు కూడా ముట్టకోకూడదని, గ్రామస్తులెవరూ తమతో మాట్లాడరాదని ఆంక్షలు విధించారని వాపోయింది. దీని ఫలితంగా తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని, గ్రామంలో తమతో ఎవరూ మాట్లాడడం లేదని తాగునీటి కోసం బయటకు వెళ్తే తమను అంటరాని వారిలా చూస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటనపై గొళంతరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, దీంతో ఎస్పీని కలిసి తమకి న్యాయం చేయాలని  వినతిపత్రం ఇచ్చినట్లు  మీడియాకు వివరించింది.   

చట్టపరంగా చర్యలు : ఎస్పీ 
గ్రామ పెద్దల ఆంక్షలు విధించిన బాధిత కుటుంబం లిఖిత పూర్వకంగా చేసిన  ఫిర్యాదు పట్ల చర్యలు తీసుకుంటాం. ఎస్‌డీపీఓతో దర్యాప్తు   చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని ఎస్పీ పినాకి మిశ్రా మీడియాకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు