ఎల్లారుం వాంగా.. ఆల్వేస్‌ వెల్‌కమ్స్‌ యూ! రాహుల్‌ను కలిసిన విలేజ్‌ కుకింగ్‌ ఛానెల్‌ టీం

9 Sep, 2022 19:07 IST|Sakshi

కన్యాకుమారి: విలేజ్‌ కుకింగ్‌ ఛానెల్‌.. యూట్యూబ్‌లో వంట వీడియోలను చూసేవాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఛానెల్‌. ప్రకృతి ఒడిలో పచ్చటి పొలాల నడుమ.. సహజసిద్ధమైన వాటితోనే సంప్రదాయరీతిలో వంటలు చేస్తూ, ఆ రుచుల్ని వాళ్లు మాత్రమే ఆస్వాదించడమే కాకుండా..  వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వడ్డిస్తూ దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన ఒక తమిళ కుకింగ్‌ ఛానెల్‌. తాజాగా ఈ ఛానెల్‌ సభ్యులు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలిశారు. 

కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీని శుక్రవారం ఈ ఛానెల్‌ సభ్యులు కలుసుకున్నారు.  వాళ్లను ఆప్యాయంగా పలకరించిన రాహుల్‌ గాంధీ.. కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ యాత్రకు విలేజ్‌ కుకింగ్‌ ఛానెల్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు. అయితే..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విలేజ్‌​ కుకింగ్‌ ఛానెల్‌కు పాన్‌ ఇండియా గుర్తింపు దక్కింది ఇంతకు ముందు రాహుల్‌ గాంధీని కలిసిన తర్వాతే. గతంలో ఈ కుకింగ్‌ ఛానెల్‌ వీడియోలో మష్రూమ్‌ బిర్యానీ సెషన్‌లో పాల్గొన్నారు రాహుల్‌. అప్పటిదాకా సౌత్‌కు మాత్రమే పరిమితమైన వీళ్ల ఫేమ్‌.. రాహుల్‌ పాల్గొనడంతో నార్త్‌కు సైతం పాకింది.  

విలేజ్‌ కుకింగ్‌ ఛానెల్‌ను కేటరింగ్‌ చేసి ఆపేసిన పెరియాతంబీ అనే పెద్దాయన తన మనవళ్ల సాయంతో 2018లో సరదాగా ప్రారంభించారు. టైంపాస్‌గా ప్రారంభించిన ఈ ఛానెల్‌.. తక్కువ టైంలో, అందునా కరోనా టైంలో బాగా పాపులర్‌ అయ్యింది. అరుస్తూ చేసే గోలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తమిళనాడులో 10 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్‌ పూర్తి చేసుకున్న తొలి యూట్యూబ్‌ ఛానెల్‌ ఇదే కావడం గమనార్హం.

ఈ బృందం ఈ మధ్యే లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌ చేసిన ‘విక్రమ్‌’ సినిమాలోనూ ఓ సీక్వెన్స్‌లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 18 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్‌పైనే ఉన్నారు. ఎల్లారుం వాంగా.. ఆల్వేస్‌ వెల్‌కమ్స్‌ యూ అంటూ అంటూ వాళ్లు ఆహ్వానించే విధానం గత నాలుగేళ్ల నుంచి ప్రధానంగా ఆకట్టుకుంటోంది కూడా.

ఇదీ చదవండి: మోదీ సూట్ Vs రాహుల్‌ టీ షర్ట్‌

>
మరిన్ని వార్తలు