Viral Wedding Menu Card: చూస్తుంటేనే నోరూరుతోంది.. సూపర్‌!

6 Jul, 2021 13:33 IST|Sakshi

కోల్‌కతా: పెళ్లంటే.. పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఆటపాటలు.. మరదళ్ల చిలిపి చేష్టలు.. బావమరుదుల సరదాలు.. బంధువుల సందడి.. బంతి భోజనాలు, నూరేళ్ల పాటు చల్లగా ఉండమంటూ వధూవరులను ఆశీర్వదిస్తూ అతిథులు ఇచ్చే దీవెనలు.. అబ్బో చెప్తూ పోతే లిస్టు కాస్త పెద్దగానే ఉంటుంది. రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలను పెనవేసే వివాహ వ్యవస్థకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం అలాంటిది. అయితే, మహమ్మారి కరోనా కారణంగా ఇటీవలి కాలంలో ఈ సందడి కాస్త తగ్గిందనే చెప్పాలి. 

కోవిడ్‌ నిబంధనల నడుమ, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిపించాల్సి వస్తోంది. ఇక భోజనం సంగతి సరేసరి. కరోనా కాలంలో వర్చువల్‌ పెళ్లిళ్లతో పాటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లతో అతిథులకు భోజనాలు పంపే ట్రెండ్‌ కూడా ఈ మధ్య కనిపిస్తోంది. ఎన్ని వెరైటీలు పెట్టినా... పెళ్లిలో మనవాళ్లతో కలిసి కూర్చుని తింటే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వెడ్డింగ్‌ మెనూ కార్డు నెటిజన్లను ఆకర్షిస్తోంది. బెంగాళీల ఇంట 90వ దశకంలో జరిగిన పెళ్లిలో వడ్డించిన వంటకాలు చూసి.. ‘‘ఆ రోజులే వేరు’’అంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.

‘‘ఓ మై గాడ్‌... మా తల్లిదండ్రుల వెడ్డింగ్‌ రిసెప్షన్‌ మెనూ కార్డును మా కజిన్‌ వెలికితీశాడు’’అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ దీనిని షేర్‌ చేశారు. ఇందులో... ‘‘శాకాహారులకు... రాధాబ్‌లావీ, దమ్‌ ఆలూ, వెజిటబుల్‌ కట్‌లెట్‌, మోటార్‌ పన్నీర్‌, చట్నీ, పాపడ్‌, కమలాభోగ్‌, ఐస్‌క్రీం... నాన్‌ వెజ్‌ తినేవారికి... ఫిష్‌ బట్టర్‌ కర్రీ, చిల్లీ ఫిష్‌, చికెన్‌ రెజాలా’’ వంటి వెరైటీలు వడ్డిస్తామని పేర్కొన్నారు. ఇక కార్డు చూసిన భోజన ప్రియులు.. ‘‘జాబితా చూస్తుంటేనే నోరూరుతోంది.. బిర్యానీ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. నా పెళ్లిలో మా సంస్కృతికి తగ్గట్లు స్పెషల్స్‌ వండిస్తా’’ అంటూ రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు