Anand Mahindra: ‘ఇదొక భావోద్వేగం’ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్‌

20 Aug, 2021 19:40 IST|Sakshi

భారతీయుల రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌తో ఉన్న సంబంధం ఎనలేనిది. స్కూల్‌, కాలేజ్‌, జాబ్‌లకు వెళ్లే వారందరూ టిఫిన్‌ డబ్బా తీసుకెళ్లడం అందరికి తెలిసిందే. ఒకప్పుడు స్టీల్‌ డబ్బాను టిఫిన్‌ బాక్స్‌గా ఉపయోగించే వారంతా ఇటీవల ప్లాస్టిక్‌ డబ్బాలకు అలవాటు పడ్డారు. కానీ ప్లాస్టిక్‌తో అనారోగ్య సమస్యలు ఉండటంతో  దృష్ట్యా మళ్లీ స్టీల్‌ వాటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. భారతీయులకు బాగా తెలిసిన స్టీల్ టిఫిన్‌ బాక్సు నేపథ్యం ఉన్న ఓ ఫోటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఒక మహిళ స్టీల్ టిఫిన్ పట్టుకుని దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు.. "న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆగష్టు 19న షేర్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ స్టీల్ డబ్బాను తీసుకెళ్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా ఈ ఫోటోకు డబ్బావాలి అని కామెంట్‌ పెట్టడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో బలమైన అనుబంధం ఉన్న భారతీయులు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు.
చదవండి: Anand Mahindra: రోబో కంటే వేగంగా దోశలు వేస్తున్నాడే..!

స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం మన దగ్గర సాధారణ విషయమే కానీ న్యూయార్క్‌లో కూడా ఒక మహిళ స్టీల్ డబ్బాను ఇలా తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. ‘స్టీల్ డబ్బాస్.. చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపాయి’ అని భావేద్వాగానికి లోనవుతున్నారు. మరొకరు స్టీల్ డబ్బానే ఓ "భావోద్వేగం" అని కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు