వ్యూస్‌ కోసం డేంజర్‌ స్టంట్స్‌.. పోలీసుల ట్విస్ట్‌ అదిరింది

13 Aug, 2021 15:29 IST|Sakshi

 బైక్‌లపై ప్రమాదకర ఫీట్లు చేస్తున్న యువకులు

సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి సవాళ్లు

ప్రాణాంతకంగా మారుతున్న ‘సోషల్‌’క్రేజ్‌ 

సాక్షి, ముంబై: బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం కొంతమంది యువకుల్లో ఫ్యాషన్‌గా మారుతోంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ మరీ యువకులు స్టంట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన వీడియోలకు ఎక్కువ వ్యూస్‌ వస్తుండటంతో, తామేమీ తక్కువ లేమంటూ మరికొందరు పోటీపడి మరీ స్టంట్లు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వారిలో 18–30 ఏళ్ల వయసు యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు. 

చిత్రీకరించిన వీడియోలను వాట్సాప్, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, వీరు స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తలకు హెల్మెట్‌ పెట్టుకోరు. బైక్‌ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం, నడుస్తున్న బైక్‌పై నుంచి దిగడం, మళ్లీ ఎక్కడం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలేస్తున్నారు. అది కూడా ర్యాష్‌ డ్రైవింగ్, హెల్మెట్‌ లేదని కారణాలు చూపుతూ తక్కువ జరిమానా విధిస్తున్నారు. 

తాజాగా ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్‌ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ యొక్క లిరిక్స్‌ను మార్చి తమ రోడ్డు భద్రతా విషయాన్ని వెల్లడించారు.‘ బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈవీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.  కాగా ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేసిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారి లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు.

A post shared by Mumbai Police (@mumbaipolice)

కాగా స్టంట్‌ మాస్టర్లు స్టంట్లు చేసేందుకు రాత్రివేళల్లో వాహనాలు, జనాల సంఖ్య తక్కువగా ఉండే రోడ్లను ఎంచుకుంటారు. ప్రధానంగా మలాడ్, దిండోషీ, కాల్బాదేవి, వర్లీ సీఫేస్, మాహీం, దాదర్, ఘాట్కోపర్, చెంబూర్, కుర్లా, బాంద్రా, సహార్, కాందివలి, దహిసర్, వాకోలా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి స్టంట్లు చేస్తారు. ఈ స్టంట్‌ మాస్టర్ల నిర్వాకంవల్ల రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో స్టంట్‌ మాస్టర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు గాయాల పాలవుతున్నారు.  

మరిన్ని వార్తలు