రెండో ఎక్కం చెప్పలేదని.. పీటల మీద పెళ్లి ఆపిన వధువు!

3 May, 2021 18:41 IST|Sakshi

పెళ్లి పీటల వరకూ వచ్చి వివాహాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మాయి వాళ్లు కట్నం తక్కువ ఇచ్చారని, మర్యాదలు సరిగా చేయలేదని, వధూవరుల్లో ఎవరికైనా ప్రేమ వ్యవహారం ఉందని తెలియడం.. ఇలా పెళ్లి నిలిచిపోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు దాచడం వల్ల కూడా పెళ్లి ఆగిపోతుంది. అబ్బాయికి బట్టతల ఉందని, అమ్మాయి పొట్టిగా ఉందని ఇలాంటి కారణాలతో కూడా జరగకుండా ఆగిపోతుంటాయి. అచ్చం ఇలాంటి కారణంతోనే ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని ‘స్టాప్‌’ అంటూ క్యాన్సిల్‌ చేసింది. ఇంతకీ ఆ రీసన్‌ ఎంటో తెలుసుకోవాలంటే మ్యాటర్‌లోకి ఎంటర్‌ అవ్వాల్సిందే..

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి ఇటీవల మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. శనివారం సాయంత్రం వివాహ కోసం మందిరానికి చేరుకున్నారు. అయితే వరుడి విద్యార్హతలపై అనుమానం వచ్చిన వధువు.. తనకు కాబోయే భర్తకు పెళ్లికి కొన్ని క్షణాల ముందు  మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ పెట్టింది.పెళ్లి దండలు మార్చుకునే ముందు అతన్ని రెండో ఎక్కం చెప్పాలని ప్రశ్నించింది. కానీ ఇది చెప్పడంలో వరుడు తడబడ్డాడు. ‘రెండో ఎక్కమేగా.. హహ చెప్పేస్తా.. చిన్నప్పుడు చదివింది కదా.. ఏం గుర్తుంటుంది.. చెప్పేస్తా... రెండు... రెండు.. ఆరు అంటూ నీళ్లు మింగాడు.

ఇంకేముంది ఆగ్రహం చెందిన వధువు నిరక్షరాస్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పేసింది. ఆ వ్యక్తికి కనీసం రెండో ఎక్కం కూడా రాదని, పెళ్లిని నిలిపివేసింది. పెళ్లి చేసుకోమని స్నేహితులు, బంధువులు వధువును ఒప్పించినా ఫలితం లేకపోయింది. వరుడు చదువురానివాడు అని తెలిసి తాము షాక్ అయ్యారని వధువు బంధువు చెప్పారు. వరుడి విద్య గురించి తమ కుటుంబం అబద్దం చెప్పారని, అతను పాఠశాలకు కూడా పోలేదని తెలిసిందన్నారు. వరుడి కుటుంబం మమ్మల్ని మోసం చేసినప్పటికీ నా సోదరి ధైర్యంగా సమాజానికి భయపకుండా పెళ్లిని ఆపేసిందని తెలిపారు. 

చదవండి: కరోనా ఎఫెక్ట్‌ : లైవ్‌లో పెళ్లి.. ఆన్‌లైన్‌లో దీవెనలు

>
మరిన్ని వార్తలు