ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్‌పై ప్రశంసలు

13 Feb, 2021 08:27 IST|Sakshi

జైపూర్‌ నగర్ నిగమ్ ‌(గ్రేటర్‌) మేయర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్‌ స్వయంగా వెల్లడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

నిండు గర్భిని అయిన మేయర్‌ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్‌ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్‌లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్‌లో వివరించారు.. 

తొలుత రాజస్తాన్‌ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్‌ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ను కూడా సమర్పించారు.

ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: 'నేను ఏలియన్‌ని' మస్క్ షాకింగ్ కామెంట్ 
వైరల్‌ : 'హెలికాప్టర్‌ కొనేందుకు లోన్‌ ఇప్పించండి'

మరిన్ని వార్తలు