Delhi Weekend Curfew: ‘సార్‌, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్‌ అదిరింది!

10 Jan, 2022 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్‌ ఉద్ధృతి పెరడగంతో రాష్ట్రాలన్నీ అలెర్ట్‌ అయ్యాయి. కోవిడ్‌ నిబంధనలను కఠినతరం చేశాయి. నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ దిశగా ఆంక్షలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింత దారుణంగా ఉంది. అయితే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. 

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయితే వీకెండ్‌ కర్ఫ్యూపై ప్రజల మెదల్లో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి. ఈ క్రమంలో కర్ఫ్యూపై ఏమైనా సందేహాలుంటే సోషల్‌ మీడిమా వేదికగా తమను ప్రశ్నించవచ్చని ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ఓ నెటిజన్‌ వింత సందేహం వ్యక్తం చేశాడు. ‘వీకెండ్‌లో మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటిస్తూ క్రికెట్‌ ఆడొచ్చా’ అని పునీత్‌ శర్మ అనే ట్విట ర్‌యూజర్‌ పోలీసులను ప్రశ్నించాడు. 
చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు

నెటిజన్‌ విచిత్ర ప్రశ్నకు పోలీసులు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా క్రికెట్‌ భాషలోనే పంచ్‌లతో రిప్లై ఇచ్చారు. ‘అది 'సిల్లీ పాయింట్' సార్. ఇప్పుడు 'ఎక్స్‌ట్రా కవర్' అవసరం. అంతే కాదు. ఢిల్లీ పోలీసులు బాగా 'క్యాచింగ్' (పట్టుకోగలరు) చెయ్యగలరు’ అని బదులిచ్చారు.  పునీత్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో పోలీసుల ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్‌.. రిపోర్టర్‌ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం

మరిన్ని వార్తలు