ఈ-పాస్‌ కోసం అప్లై..‘సిక్స్‌’ తెచ్చిన తంటాతో పరేషాన్‌

14 May, 2021 14:30 IST|Sakshi

తిరువనంతపురం: ఒక్క పదం తప్పుగా రాయడంతో ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. ఈ పాస్‌ కావాలని సిక్స్‌కు బదులు సెక్స్‌ అని రాశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. ఈ సంఘటన వైరల్‌గా మారింది. ‘‘సాయంత్రం సెక్స్‌ కోసం వెళ్లాలి’ పాస్‌ ఇవ్వండి అని ఈ పాస్‌ రిజిస్ట్రేషన్‌ ఓ వ్యక్తి చేసుకున్నాడు. పోలీసులు ఇది చూసి షాక్‌కు గురయ్యారు. ఆకతాయి పనిగా భావించి పోలీసులు అతడిని గుర్తించి ఇంటికెళ్లి స్టేషన్‌కు తరలించారు. విచారణ చేయగా అతడు చెప్పిన సమాధానం వింటే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

ప్రస్తుతం కేరళలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో బయటకు వెళ్లేందుకు కన్నూర్‌లోని కన్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకోసం వెళ్లాలి? అనే కాలమ్‌లో మనోడు ‘సాయంత్రం సెక్స్‌ కోసం వెళ్లాలి’ (Need To Go For Sex) అని రాశాడు. దీన్ని చూసిన పోలీసులు అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేయమని ఆదేశించాడు. వెంటనే వల్లపట్టణం పోలీసులు అతడిని గుర్తించి విచారించారు. అప్పుడు ఆ వ్యక్తి తాను చేసిన తప్పును చూసి కంగారు పడ్డాడు. తాను తప్పు రాశానని.. ఆరు గంటలకు రాయబోయి సిక్స్‌ బదులు సెక్స్‌ అని రాసినట్లు తెలిపాడు.

చూసుకోకుండా అలా పంపానని పోలీసులకు వివరణ ఇచ్చాడు. మొత్తం వివరాలు తెలుసుకుని అతడు చెప్పింది.. వాస్తవమేనని నమ్మి వదిలేశారు. అతడు క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పాస్‌ రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా వినియోగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సరైన కారణాలు ఉంటేనే పాస్‌లు జారీ చేస్తున్నారు.

చదవండి: కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: సీఎం పిలుపు
చదవండి: కరోనా వేళ ఒక్క పిలుపు: కదిలొస్తున్న తారలు

మరిన్ని వార్తలు