Viral: మ్యాట్రిమోనీలో యాడ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు కాల్‌ చేయద్దంటూ..

20 Sep, 2022 16:11 IST|Sakshi

ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. 

వ్యాపారవేత్త సమీర్‌ అరోరా.. న్యూస్‌ పేపర్‌లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్‌మెంట్‌ క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌, లేదా డాక్టర్‌ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు.  ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్‌లైన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్‌ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్‌ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది.

మరిన్ని వార్తలు