ఆ ఆటో డ్రైవర్‌కు నెటిజన్లు ఫిదా : భారీ విరాళాలు

24 Feb, 2021 11:27 IST|Sakshi

మనవరాలి  చదువు  కోసం తపించిన ముంబై  ఆటోడ్రైవర్

ఆటో డ్రైవర్‌  దేశ్‌రాజ్  సంకల్పంపై ప్రశంసలు

రూ. 24 లక్షలకు పైగా విరాళాలు

సాక్షి, ముంబై : మనవరాలి విద్య కోసం ఇల్లు అమ్మేసి ఆటోలో కాలం గడుపుతున్న ముంబై ఆటో డ్రైవర్‌ కథనంపై అనూహ్య స్పందన లభించింది. ప్రంపచం నలుమూలలనుంచి దాతలు స్పందించడంతో ఏకంగా రూ. 24 లక్షలు అతని ఖాతాలో చేరాయి. దీంతో ఆటో డ్రైవర్‌ దేశ్‌రాజ్‌ సంతోషాన్ని ప్రకటించారు. ప్రతిఫలం ఆశించకుండా మంచి మనసుతో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ పోతే.. తగిన ఫలితం ఎప్పటికైనా లభిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనంగా  నిలిచిన వైనంపై నెటిజన్లు కూడా సంతోషం ప్రకటిస్తుండటం విశేషం. (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర)

ఒంటి చేత్తో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మనవరాలిని చదివించడంకోసం ఇల్లు అమ్మేసి మరీ ఆటోలో జీవిస్తున్న దేశ్‌రాజ్ (74) హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి కథనం సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కుమారులు మరణించిన తరువాత, వారి కుటుంబాలను (ఇద్దరు కోడళ్లు, నలుగురు పిల్లల్ని) చూసుకునే బాధ్యత  వృద్ధుడైన దేశ్‌రాజ్పై పడింది. దీంతో జీవనాధారమైన ఆటో రిక్షా ద్వారానే  రాత్రింబవళ్లూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో మనవరాలికి చదువుకు తాహతుకుమించి ఫీజలు కట్టాల్సి వచ్చింది. అయినా వెరవలేదు.. ఇల్లు అమ్మేసి మరీ ఫీజును చెల్లించి ఆమెను చదవించేందుకు ఆ పెద్దాయన తీసుకున్న నిర్ణయం ప్రశంలందుకుంది. ఆయన సంకల్పం నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంది.  ఫలితంగా అనేకమంది ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఒక ఫేస్‌బుక్‌ యూజర్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులను స​మీకరించేందుకు ఉపక్రమించారు. దీంతో  24 లక్షల రూపాయలపైనే సమకూరాయని హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి వెల్లడించింది. వాస్తవానికి రూ .20 లక్షలు వసూలు చేయాలనేది లక్ష్యం కాగా, దాతల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపింది. దీనికి సంబంధించి తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దేశ్‌రాజ్‌ ధన్యవాదాలు తెలుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌  చేసింది. తనకు 24 లక్షల రూపాయల చెక్కు అందిందని ధృవీకరించిన దేశ్‌ రాజ్‌, తనపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు