రాహుల్‌ గాంధీ నా కొడుకులాంటి వాడు.. నర్సు వీడియో వైరల్‌

19 Aug, 2021 15:30 IST|Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇటీవల తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో రెండు రోజులు(సోమ, మంగళవారం) పర్యటించిన విషయం తెలసిందే. కేరళ పర్యటనలో భాగంగా గాంధీపార్కెలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన బోధనలను, జీవన విధానాన్ని స్మరించారు.  అనంతరం కోజిక్కోడ్‌లో రాహుల్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సిఎల్‌ఎటి)లో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులతో కలసి భోజనం చేశారు. నియోజవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం వయనాడ్‌లో నర్సు రాజమ్మ వవతిల్‌ను రాహుల్‌ కలిశారు. 

రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్‌లో నర్సుగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. 1970 జూన్‌ 19 రాహుల్‌ గాంధీ జన్మించిన సమయంలో రాజమ్మనే అక్కడ నర్సుగా పనిచేస్తున్నారు. మొదటగా రాహుల్‌ తన చేతుల్లోకి తీసుకుంది రాజమ్మనే. తాజాగా రాహుల్‌ వయనాడ్‌ వచ్చారని తెలిసి ఆయన్ను కలిసిందేకు వచ్చారు. రాహుల్‌ కారులో కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చి రాజమ్మ పలకరించారు. రాహుల్‌ను చూసిన వెంటనే అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించారు. అలాగే ఓ స్వీట్‌ బాక్స్‌ను బహుకరించారు.  

రాజమ్మ తన కూడుకును రాహుల్‌ గాంధీకి పరిచయం చేస్తూ.. ఇతను నా కొడుకులాంటి వాడు. నా కళ్ల ముందే పుట్టాడు. మీరందరూ తనను చూడకముందే నేను చూశాను అంటూ సంబరపడ్డారు.తల్లి సోనియా గాంధీని కుశల ప్రశ్నలు అడిగినట్లు చెప్పమని అన్నారు. ‘నేను మా ఇంటి నుంచి మీకు ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీకు అంత సమయం లేదు, నాకు అర్థమైంది. ఒకవేళ ఇబ్బంది పెడితే క్షమించాలి’ అని అన్నారు. దీంతో వెంటనే అలాంటిదేం లేదంటూ ఆమెను అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. దీనికి సంబంధిన వీడియోను కేరళ  కాంగ్రెస్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నర్సను కలిసి రాహుల్‌ మాట్లాడిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు