భూతల విమానం.. ప్రయాణం ప్రారంభం అయ్యేలోపే నిండా చెత్తాచెదారం!

28 Jan, 2023 14:29 IST|Sakshi

Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్‌ ట్రైన్‌లు, మాగ్నటిక్‌ బుల్లెట్‌ ట్రైన్‌ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్‌ లాంటి సెమీ స్పీడ్‌ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. 

భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్‌ రైలుగా వందే భారత్‌ ఓ ఫీట్‌ సాధించగా..  వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్‌ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. 

వందే భారత్‌ రైలు కంపార్ట్‌మెంట్‌లో మొత్తం వాటర్‌ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్‌ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్‌ అధికారి అవానిష్‌ శరణ్‌ తన ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. పైగా ‘వీ ద పీపుల్‌’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్‌ సెట్‌ను ఉదాహరించారాయన. 

ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్‌ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు.

ఇదిలాఉంటే సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్‌ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్‌ సంస్థ వందేభారత్‌ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్‌ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్‌బిన్‌లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్‌.

హైక్లాస్‌ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్‌ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్‌ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్‌ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్‌ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్‌ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్‌ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్‌ ప్రెస్‌ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్‌ స్టేషన్‌ నుంచి మానిటరింగ్‌ చేస్తారు.

భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్‌ హోటల్‌లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్‌ కాక్‌పిట్‌ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్‌ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. 

మరిన్ని వార్తలు