యజమాని జంట పైశాచిక ఆనందం.. బాలికను చిత్ర హింసలు పెడతూ...

8 Feb, 2023 15:41 IST|Sakshi

ఇంట్లో పని నిమిత్తం చేరిన ఓ మైనర్‌ బాలికను దంపతులైన యజమానులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాలికకు అన్నం పెట్టకుండా పస్తులుంచి ఆమెను శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు బాధితురాలిని వేధించిన రాక్షస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన 13 ఏళ్ల మైనర్‌ బాలిక ఉద్యోగస్తులైన ఓ దంపతుల ఇంట్లో పని మనిషిగా చేరింది. కాగా బాలికపై దంపతులు గత కొంత కాలంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని, ఇంట్లోని వస్తువులను దొంగిలించిందనే నిందలు వేస్తూ కర్రలు, ఇనుప వస్తువులను వేడి చేసి ఆమెపై దాడికి పాల్పడుతున్నారు. ముఖం, చేతులపై కొడుతూ దారుణంగా గాయపరిచారు. రోజులపాటు ఆమెకు అన్నం పెట్టకుండా హింసిస్తూ రాక్షస ఆనందం పొందారు. దీంతో ఆకలికి అలమటించి యజమానులు తిని చెత్తబుట్టలో పడేసిన ఆహారాన్ని బాలిక తినేది.

అయితే దీపక్‌ నారాయణ అనే యాక్టివిస్ట్‌ బాలిక ఘోర పరిస్థితిని తెలుసుకొని ఆమె ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బాలిక ముఖం, పెదాలు, చెంపలు, చేతులపై కాలిపోయిన గాయాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. దీనిపై స్పందించిన గురుగ్రామ్‌కు చెందిన ఓ స్వంచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక యజమానుల బారి నుంచి మంగళవారం సాయంత్రం బాలికను రక్షించారు. గత కొన్ని నెలలుగా ఆమెను భయంకరంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలికను రక్షించే సమయంలో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఏడాది కిత్రం ఓ ఏజెన్సీ ద్వారా తమ మూడు నెలల పాపను సంరక్షణ కోసం బాలికను నియమించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సంబంధింత సెక్షన్ల ప్రకరం కేసు నమోదు చేశారు. అయితే దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అరెస్ట్‌ అయిన మహిళను ఆమె పనిచేస్తున్న సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు