Scuba Diving: కవర్‌లో చిక్కుకున్న చేప, మహిళ కంటబడటంతో..

11 May, 2021 10:14 IST|Sakshi

సాటి మనిషికి సాయపడటం ఎంతో అవసరం. కేవలం మనిషికే కాదు, జంతు జీవ రాశులకు సహయం అందించడం వల్ల మానవత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్లం అవుతాం. చేసిన సాయం చిన్నదే అయినా అది జీవితాంతం గుర్తుంటుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినప్పటికీ భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌ సందా షేర్‌ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ సముద్రంలో తన స్నేహితులతో కలిసి నాట్‌ సేన్మువాంగ్‌ అనే మహిళ స్కూబా డైవింగ్‌కు వెళ్లింది

అక్కడ నీటి అడుగున ఓ బండరాయి దగ్గర ప్లాస్టిక్ ప్యాకెట్ లోపల చిక్కుకున్న చేపను నాట్‌ గమనించింది. వెంటనే దాన్ని చేతులోకి తీసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ నుంచి చేపను రక్షించడంతో అది తిరిగి నీటిలోకి వెళ్లింది. ఈ వీడియోను సుశాంత నందా సోమవారం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మనిషి ఎక్కడుంటాడో అక్కడ మానవత్వం పరిమళించే అవకాశం ఉంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

‘చాలా గొప్ప పని చేశారు మేడమ్‌. కానీ మరోవైపు ఆలోచిస్తే అదంతా మనుషుల నిర్లక్ష్యమే అనిపిస్తోంది. సముద్రాలను కలుషితం చేసి చేపలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాం' 'అవును, భగవంతుడు సృష్టించిన దానిలో ఉత్తమమైనది మనిషే. ఒకరినొకరు సాయం చేసుకుంటూ ప్రపంచాన్ని గొప్పగా మారుద్దాం’ అని నెటిజన్లు కామెంట్లు  చేస్తున్నారు.

చదవండి: చేపను వాకింగ్‌ తీసుకెళ్లాలనుకుంటున్నారా.. అయితే!

మరిన్ని వార్తలు