వైరల్‌: తల్లి రిటైర్‌మెంట్‌.. అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు

31 Jul, 2022 21:03 IST|Sakshi

జైపూర్‌: తన తల్లి ఉద్యోగ విరమణ రోజుని జీవితాంతం గుర్తుండిపోయేలా కొడుకు సర్‌ప్రైజ్‌ అందించాడు. అందరిని ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన బహుమతి ఇచ్చి.. తల్లి కళ్లలో ఆనందాన్ని చూసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

రాజస్థాన్‌ రాష్ట్రం అజ్మీర్‌కు చెందిన సుశీలా చౌహాన్‌ అనే మహిళ పిసంగన్‌లోని కేసర్‌పురా హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 33 ఏళ్లుగా టీచర్‌గా సేవలందించిన సుశీలా శనివారం పదవి విరమణ చేశారు. తల్లి రిటైర్‌మెంట్‌ కార్యక్రమం గురించి తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు యోగేశ్‌ చౌహాన్‌ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. 

పదవీ విరమణ రోజును తల్లికి మధురమైన జ్ఞాపకంగా మలిచేందుకు యోగేశ్‌ అదిరిపోయే ఆలోచన చేశాడు. ఆమె కోసం ఏకంగా హెలికాప్టర్ రైడ్‌ను బుక్ చేశాడు. హెలికాప్టర్‌లో తల్లిని స్కూల్‌ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తల్లి ఆనందం కోసం కొడుకు చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. 
చదవండి: Zomato: వీల్‌చైర్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు

దీనిపై యోగేశ్‌ చౌహాన్ మాట్లాడుతూ..‘ మా అమ్మ టీచర్‌గా రిటైరయ్యింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే అమ్మను ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంత మంది గుమికూడతారని ఊహించలేదు. అది మాకు మరింత సంతోషాన్నిచ్చింది.’ అని తెలిపాడు. ఇక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన యోగేష్‌ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు