Viral Love Story: నా కౌశిక్‌ చచ్చిపోయాడు.. అయినా

21 Jul, 2021 15:38 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది.

ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి.


ఫొటో కర్టెసీ: హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే

‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్‌ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది.

నేను ఆర్జే, తను రైటర్‌
‘‘కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కౌశిక్‌ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్‌. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్‌ఫ్రెండ్‌. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్‌ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్‌ టవర్‌ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. 


ఫొటో కర్టెసీ: హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే

సలహా ఇచ్చేందుకు తను లేడు
తనకు న్యూయార్క్‌ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్‌ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్‌ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్‌ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్‌ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. 

అప్పుడే భర్తను మర్చిపోయిందా?
ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. 


ఫొటో కర్టెసీ: హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే

మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్‌కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి.  తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్‌ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు