Viral: ‘దొంగ తెలివి’.. ఆకలేయడంతో కిచెన్‌లో దూరి కిచిడీ ప్లాన్‌, శబ్దాలు రావడంతో..

12 Jan, 2022 16:41 IST|Sakshi

గువాహటి: రోజురోజుకీ దొంగతనం కేసులు ఎక్కువైపోతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లు కంట పడితే చాలు ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనానికి వచ్చిన వారు చప్పుడు చేయకుండా సైలెంట్‌గా పని కానిచేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో వంట వండుకుంటూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విచిత్ర ఘటన అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంటికి తాళం వేసి ఉండటంతో విలువైన వస్తువులు దొంగిలించేందుకు దొంగ లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మూటగట్టాడు. అయితే ఇంతలోనే దొంగకు ఆకలి వేయడంతో కిచెన్లోకి వెళ్లి కిచిడీ వండుకోవటం మొదలుపెట్టాడు. కానీ వంట చేసే సమయంలో సౌండ్స్‌ రావడం అతని కొంప ముంచింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటింటి నుంచి శబ్దాలు రావడం పక్కింటి వారికి అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తాపీగా కిచిడీ వండుకుంటున్న దొంగను పట్టుకున్నారు. 
చదవండి: వైరల్‌ వీడియో: ప్యాంట్‌పై బురద, ఊగిపోతూ ఏం చేసిందంటే..

కాగా ఈ దొంగతనం ఘటన సోమవారం చోటుచేసుకోగా ఈ విషయాన్ని అస్సాం పోలీసులు చమత్కారంగా ట్వీట్‌ చేశారు. ‘కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. గువాహటి పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.
చదవండి: RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం

మరిన్ని వార్తలు