ఫేమ్‌ కోసం చేసిన స్టంట్‌.... కటకటాల పాలు చేసింది

22 May, 2022 19:45 IST|Sakshi

సాక్షి, నొయిడా: ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ కోసం రకాలరకాల స్టంట్‌లు చేసి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకన్న ఉదంతాలను చూస్తునే ఉన్నాం. కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు రద్దీగా ఉండే రహదారుల్లో చేసి ప్రజలను భయబ్రాంతుకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఇలాంటి విన్యాసాలతో రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యిపోవాలనుకుంటారే తప్ప అవి ఎంత ప్రమాదకరమని కొంచెం కూడా ఆలోచించారు. అలానే ఒక వ్యక్తి ముందు వెనుక ఆలోచించకుండా రద్దీగా ఉండే రహదారుల్లో ఇలాంటి స్టంట్లు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి సోషల్‌ మీడియా క్రేజ్‌ కోసం భయంకరమైన స్టంట్‌లు చేసి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రద్దీగా ఉండే రహదారిలో బాలీవుడ్‌ సినిమా 'పూల్‌ ఔర్‌ చిత్రంలో' హిరో అజయ్‌ దేవ్‌గన్‌  ఎంట్రీ స్టంట్‌ని చేశాడు. రెండు ఎస్‌యూవీ కారులపై ఏ మాత్రం భయంలేకుండా నిలబడి ఉండే భయంకరమైన స్టంట్‌ చేశాడు.

అంతేకాదు మోటారు బైక్‌తో కూడా కొన్ని రకాల భయంకరమైన విన్యాసాలు చేశాడు. ఐతే అతను తన ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టే స్టంట్‌లు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీపుటేజ్‌ల ఆధారంగా సదరు వ్యక్తిని రాజీవ్‌గా గుర్తించడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో స్టంట్‌ వీడియోలు పోస్ట్‌ చేసేందుకే ఈ ప్రమాకరమైన స్టంట్ చేసినట్లు చెప్పాడన్నారు. 

(చదవండి: ఇంట్లో అలంకరణకు ఉపయోగించే ప్లవర్‌వేజ్‌... ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చింది)

మరిన్ని వార్తలు