‘‘కుబేరుల ఇళ్లు కూడా ఇంత అందంగా ఉండవు’’

5 Jun, 2021 17:03 IST|Sakshi

నెటిజనులు ఆకర్షిస్తోన్న అందమైన గూడు

ప్రకృతిని మించిన గొప్ప డిజైనర్‌ లేరనేది వాస్తవం. ఈ రోజు మన కళ్ల ముందు ఆవిష్కృతమైన ఎన్నో అద్భుతాలకు ప్రకృతే ప్రేరణ. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వీటిలో ఒకటి పక్షి గూడు. గిజిగాడు నిర్మించే గూడు చూస్తే.. గొప్ప గొప్ప ఇంజనీర్లు కూడా ఆశ్యర్చపోతారు. నేటికి కూడా ఆ టెక్నిక్‌ ఎవరికి అంతుచిక్కలేదంటారు. ఇప్పుడు ఇదంతా ఎదుకంటే తాజాగా ఓ బుల్లి పక్షి గూడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారు ఎన్ని కోట్లు పెట్టినా.. ఎంత గొప్ప ఇంజనీర్‌ను నియమించుకున్నా ఇంత అద్భుతమైన నిర్మాణం చేయలేరు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనలు. 

బ్యూటెంగేబీడెన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ‘‘ప్రకృతి అందంగా ఉంది’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఒక మొక్కకున్న సున్నితమైన ఆకు లోపల ఓ పక్షి గూడు నిర్మించుకోవడమే కాక దానిలో గుడ్లు కూడా పెట్టింది. ఈ చిన్న గూడును మోయడం కోసం ప్రకృతే ఆ ఆకును ఇలా డిజైన్‌ చేసిందేమో అనేలా ఉంది. త్వరలోనే ఈ ఆకు మూడు చిన్నచిన్న పక్షి పిల్లలను చూడబోతుంది.

ఇక ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజనులను తెగ ఆకర్షిస్తోంది. ‘‘కాంక్రీట్‌ జంగిల్‌లో ఉండే మాకు ఇంత అద్భుతమైన దృశ్యాలు కనిపించడం చాలా చాలా అరుదు. కృత్రిమ జీవితాలకు అలవాటు పడ్డ మాకు ఈ సహజమైన అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు’’.. ‘‘నీ ఇంటి ముందు కుబేరుల రాచ సౌధాలు కూడా వేస్టే’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు