థానేకు ఏక్‌నాథ్‌ షిండే.. డ్రమ్స్‌ వాయించి గ్రాండ్‌ వెల్క‌మ్ చెప్పిన భార్య

6 Jul, 2022 12:42 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఏక్‌నాథ్‌ షిండే తన సొంత నియోజకవర్గమైన థానే స్వగృహానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. బ్యాండు, మేళాలు, బాణసంచా పేలుస్తూ శిండేకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి లతా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. షిండే రాక సందర్భంగా ఆమె స్వయంగా డ్రమ్స్‌ వాయించి భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యాండ్‌, పాటు లతా షిండే డ్రమ్స్ వాయించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏ ఒక్క శివసైనికుడికి అన్యాయం జరగదు
కాగా షిండే తన  ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ముంబై నుంచి థానేకు బస్సులో బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు థానే చేరుకున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన కార్యకర్తలు భారీ వర్షంలో అలాగే నిలుచుండి స్వాగతం పలికారు. సుమారు నాలుగు గంటల పాటు స్వాగత ర్యాలీ జరిగింది. దివంగత శివసేన నేత ఆనంద్‌ దిఘే స్మృతి స్ధలంవద్ద షిండే నివాళులర్పించారు. 

ఈ సందర్బంగా షిండే మాట్లాడుతూ.. దివంగత హిందు హృదయ్‌ సమ్రాట్, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే, ధర్మవీర్‌ ఆనంద్‌ దిఘే ఆశీర్వాదంతో రాష్ట్రంలో శివసేన–బీజేపీ ప్రభుత్వం అస్థిత్వంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఏ ఒక్క శివసైనికుడికి కూడా అన్యాయం జరగదని నూతన ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
చదవండి: Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే

ట్రాఫిక్‌ జామ్‌
శిండే స్వాగత కార్యక్రమం కారణంగా థానే–ముంబై సరిహద్దులో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ పూర్తిగా  స్తంభించిపోయింది. కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చింది. గత్యంతరం లేక వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఒక పక్క భారీ వర్షం, మరోపక్క రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా అప్పటికే థానేలో ట్రాఫిక్‌ మందకొడిగా సాగుతోంది. దీనికి తోడు సీఎంకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, కటౌట్లు ట్రాఫిక్‌ను మరింత ఇబ్బందులకు గురిచేశాయి.

మరిన్ని వార్తలు