ఎనిమిదడుగుల మొసలి.. ఫారెస్ట్ అధికారులను రెండు గంటలపాటు..

3 Aug, 2021 20:26 IST|Sakshi

జైపూర్‌: సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లలో ఉండే జీవులు మానవ ఆవాసాలకు కొట్టుకుని వస్తుంటాయి. పాములు, మొసళ్లు, తదితర జీవులు నీటిప్రవాహంలో కొట్టుకుని వస్తుంటాయనే విషయం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులన్ని నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో.. ఎనిమిదడుగుల మొసలి దారితప్పి ఒక ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

వివరాలు.. సవాయి మాధోపూర్‌ జిల్లాలోని ఒక ఇంటి ఆవరణలోకి ఎనిమిది అడుగుల భారీ మొసలి ప్రవేశించింది. ఆ ఇల్లు చెరువుకు దగ్గరలో ఉంటుంది. కాగా, ఇంటి ఆవరణలో మొసలిని చూసిన వారు భయాందోళనలకు గురయ్యారు. ఆ మొసలి అటు ఇటూ తిరుగుతూ కాసేపు బీభత్సాన్ని సృష్టించింది. భారీ మొసలిని చూడటానికి స్థానికులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో, ఇంట్లోని వారు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  కాసేపటికి రంగంలోకి దిగిన ఫారెస్ట్  అధికారులు మొసలిని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని బంధించడానికి పెద్ద బోనును తీసుకువచ్చారు.

మొసలిని తాళ్లసహయంతో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, మొసలి అధికారులకు ముప్పు తిప్పలు పెట్టి.. చిక్కినట్టే చిక్కి తప్పించుకోసాగింది. కాగా, దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చివరకు మొసలిని బంధించారు. ఈ సంఘటనను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీన్ని తమ ఫోనులో రికార్డు చేసుకున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

>
మరిన్ని వార్తలు