హృదయ విదారకం: తల్లికి నోటితో శ్వాసనందించిన కూతురు..

2 May, 2021 16:49 IST|Sakshi

లక్నో:  దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మరణహోమం సృష్టిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఆసుపత్రిలో బెడ్స్‌ లేక, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ వారిని కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో  తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. రాష్ట్రంలోని భైరాచి జిల్లాలోకో మహిళ ఇటీవల కరోనా బారిన పడింది. కోవిడ్‌ బాధితురాలిని ఆమె ఇద్దరు కూతుళ్లు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందించే లోపే బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. దీంతో తమ తల్లిని ఎలాగైనా కాపాడుకోవడం కోసం ఓ కూతురు తన నోటితో శ్వాస అందిస్తూ అమ్మను బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. ఇక దృశ్యాలు చూసిన ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు చలించిపోయారు. కోవిడ్‌ బారినపడి ఊపిరాడక అల్లాడిపోతున్న తల్లిని కాపాడుకునేందుకు కూతురు పడ్డ కష్టం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోఇలాంటి ఘటనే  చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ భార్య తన భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించింది. ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్​ అనే మహిళ.. కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్​ను కాపాడుకోవడానికి ఎవ్వరూ చేయని సాహసం చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసనందించింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.

చదవండి: ఏప్రిల్‌ నెల వచ్చిందంటే దేశవాసుల గుండెల్లో రైళ్లు

మరిన్ని వార్తలు