Viral Video: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు

21 Jan, 2023 19:51 IST|Sakshi

వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్‌ కిషోర్‌ పాండే అనే వృద్ధ టీచర్‌  కైమూర్‌ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్‌ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్‌ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు.

దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్‌ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్‌ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు.

పోని ఆ సైకిల్‌ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్‌ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్‌లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై  కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్‌ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.

(చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది)

మరిన్ని వార్తలు