Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..

16 Sep, 2022 19:44 IST|Sakshi

బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్‌లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్‌ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్‌ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బం‍డి నడిపి వావ్‌ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్‌ చేయడం మరింత స్పెషల్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్‌ రయ్‌ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది.

దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్‌..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్‌కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్‌ గోల్స్‌ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్‌ ప్లేట్‌ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది.

A post shared by Susmita Dora (@the_aspiring_seed)

మరిన్ని వార్తలు