Video: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై.. నోట్ల కట్టను నోట్లో పెట్టుకొని

13 Dec, 2022 19:48 IST|Sakshi

సాధారణంగా కావాల్సిన పనులు తొందరగా జరగాలంటే అధికారులు లంచం డిమాండ్‌ చేయడం తెలిసిందే. ఇది కాస్తా ప్రస్తుతం లంచాలు ఇవ్వనిదే ఏ పని జరగదనే స్థాయికి వచ్చింది. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు అయినా చివరికి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా లంచాల బాట పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ పోలీస్‌ అధికారి పట్టుబట్టాడు. అయితే తరువాత సదరు అధికారి చేసిన పనికి అందరూ షాక్‌ అవుతున్నారు. అసలేం జరిగిందంటే  

హర్యానాలోని ఫరీదాబాద్‌లో లంచం తీసుకుంటున్న పోలీస్‌ను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితుడిపై చర్య తీసుకోవడానికి శుభనాథ్‌ అనే వ్యక్తి నుంచి సబ్-ఇన్‌స్పెక్టర్ మహేంద్ర పాల్‌ రూ. 10 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు అప్పటికే అధికారికి రూ.6 వేలు ఇచ్చాడు. అయితే తరువాత విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి నుంచి ఎస్సై లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

లంచగొండి పోలీస్‌ నుంచి డబ్బులు రికవరీ చేస్తుండగా.. అతడు వెంటనే ఎవరూ ఊహించని పనిచేశాడు. లంచం రూపంలో తీసుకున్న కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకుని మింగేశాడు. పోలీసు చర్యను అడ్డుకున్న అధికారులు వెంటనే అతను మింగిన డబ్బును బయటకు తీయడానికి  ప్రయత్నించారు. ఓ పోలీస్‌ అధికారి ఏకంగా నోట్లో వేళ్లు కూడా పెట్టాడు. కానీ పోలీస్‌ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఫలితం లేకుండా పోయింది. దీన్నంతటినీ ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. పట్టుబడ్డ పోలీస్‌ నోట్లు మింగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజంగా అతడు చేసిన పనితో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు