ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్‌

30 Aug, 2022 15:12 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌లోని మోతిహారిలో ఎరువులు నిల్వ ఉంచడం, బ్లాక్‌ మార్కెటింగ్‌  చేయడం పై ఆగ్రహం చెందిన రైతులు ఒక ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా ఎరువుల ధరలు తమ ఇష్టరాజ్యంగా పెంచేందుకు యత్నిస్తున్న ఒక అధికారికి బుద్ధి చెప్పేందుకే ఇలా చేసినట్లు సమాచారం.

వివరాల్లోకెళ్లే...బిహార్‌లో వ్యవసాయ శాఖ నియమించిన కిసాన్‌ సలహదారుడు నితిన్‌ కుమార్‌ని రైతులు స్థంభానికి కట్టేశారు. సదరు సలహదారు ఎరువుల విక్రయదారులతో చేతులు కలిపి ధర పెంచే పనిలో పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. అదీగాక యూరియా బస్తాను ప్రభుత్వం రూ. 265కి విక్రయిస్తుంటే స్థానిక దుకాణాదారులు అదే యూరియాని తమకు రూ.500 నుంచి రూ. 600 విక్రయిస్తున్నారని వాపోయారు.

ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి సదరు ప్రభుత్వాధికారిని విడిపించే ప్రయత్నంలో పడింది. చివరకు అధికారులు రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని వస్తువులు ప్రభుత్వ ధరకు లభిస్తాయని హామీ ఇ‍వ్వడమే గాక సదరు అధికారిని విడిపించేందుకు వారిని ఒప్పించారు. 

(చదవండి: క్లాస్‌రూమ్‌లో హఠాత్తుగా ఫ్యాన్‌ పడటంతో విద్యార్థినికి గాయాలు)

మరిన్ని వార్తలు