Leopard Viral Video: చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో

9 May, 2022 11:46 IST|Sakshi

సాధారణంగా ఎక్కడో దూరంలో ఉన్న చిరుతపులిని చూస్తేనే గుండెలో వణుకు పుడుతుంది. ఇక మన పక్కన వచ్చి నిల్చుంటే భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి. అదే చిరుతపులితో పోరాటం అంటే ఎలా ఉంటుంది?. ఇంకేమైనా ఉందా.. పులి ఆకలికి ఆహారం అవ్వాల్సిందే. కానీ కొందరు అధికారులు ప్రాణాలకు తెగించి, చిరుతపులితో పోరాడారు. హర్యానాలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్‌లో ఓ పోలీస్‌, ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన హర్యానాలో ఆదివారం చోటుచేసుకుంది.

పానిపట్‌ జిల్లాలో బెహ్రాంపూర్‌ గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఆదివారం ఆపరేషన్‌ చేపట్టారు. తమ గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం చర్యలు చేపట్టింది. చిరుతపులిని పట్టుకునే క్రమంలో అది..పోలీసులూ, అటవీ అధికారులపైకి దూకింది. దాడి చేయకుండా కర్రలతో, రాళ్లతో బెదిరించినా అధికారులపై పంజా విసిరింది. దాని గోళ్లతో చర్మంపై రక్కింది. చిరుత దాడిలో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు. అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు.  
చదవండి: మహారాష్ట్ర సీఎంకు ఎంపీ నవనీత్‌ కౌర్‌ సవాల్‌

ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారుల  ధైర్యాన్ని మెచ్చుకుంటూ పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పోలీసులు, అటవీ శాఖ ప్రజలకు విధి నిర్వాహణలో కష్టమైన రోజు. ఇందులో ఇద్దరు, ముగ్గురు గాయపడ్డారు.. వారి ధైర్యానికి, సాహసానికి సెల్యూట్‌. చివరికి, చిరుతపులితో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.’ అని పానిపట్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ ట్విటర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు