పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది?

15 Jan, 2021 13:03 IST|Sakshi

సిమ్లా: సాధారణంగా పులి పేరు చెబితేనే గుండెలు జారి పోతాయి. ఇ​క గత కొద్ది రోజులుగా తెలంగాణలో పులి సంచారం కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అడవిలో ఉండాల్సిన ఈ కృరమృగాలు జనారణ్యంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మనుషులను, సాధు జంతువులను వెంటాడి ప్రాణాలు సైతం తీస్తున్నాయి. ఇది మన దగ్గర పరిస్థితి అయితే.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓ చిరుత ఏకంగా మనుషులతో ఆడుతుంది. వారి మీదకు ఎక్కి గారాలు పోతుంది. ఈ వింత ప్రవర్తన అటవీ అధికారులను, జంతు శాస్త్రవేత్తలని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: ఏ పులి ఎక్కడ తిరుగుతుందో!)

వివరాలు.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తీర్థన్‌ వ్యాలీ ప్రాంతంలో చిరుత రోడ్డు మీదకు వచ్చింది. అక్కడే గుంపుగా ఉన్న మనుషుల దగ్గరకు వెళ్లింది. ఇక చిరుత తమ దగ్గరకు రావడంతో.. వారంతా భయంతో పరుగు లంకించుకున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం కదలకుండా అక్కడే ఉన్నాడు. ఇక చిరుతని చూసి జడుసుకుని దూరంగా పోయిన వారంతా అది.. సదరు వ్యక్తిపై దాడి చేస్తుందని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. చిరుత ఆ వ్యక్తితో ఆడటం ప్రారంభించింది. అతడి మీదకు ఎక్కి గారాలు పోయింది. ఇక చిరుత వింత వేషాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప్రవీణ్‌ కశ్వాన్‌ దీన్ని తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం‌)

‘ఈ చిరుత ప్రవర్తనని అంచాన వేయలేకపోతున్నాం. చాలా వింతగా ప్రర్తిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ప్రవీణ్‌ వీడియోను షేర్‌ చేశారు. ఇక దానితో ఆడుతున్న మనుషుల్ని కూడా ఆయన విమర్శించారు. చిరుతతో జనాల ప్రవర్తన సరిగా లేదు. నిన్నటి నుంచి ఈ వీడియో వైరలవుతోంది అన్నారు. ఇక కామెంట్‌ సెక్షన్‌లో కస్వాన్ అనే వ్యక్తి చిరుతపులి పెంపుడు జంతువులాగా ప్రవర్తిస్తుందని.. అంతేకాక అది ఏదైనా ఎస్టేట్ నుంచి తప్పించుకొని ఇలా వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీన్ని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే సమర్థించారు. "మనుషులు పెంచిన జంతువుల విషయంలో ఇలాంటి ప్రవర్తన సాధ్యమవుతుంది. ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరం. అడవి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచితే ఇలాంటి అసాధారణమైన, ఆశ్చర్యకరమైన పద్దతిలో ప్రవర్తిస్తాయి. అయితే ఇది ఆందోళన కలిగించే అంశం అంటూ పాండే ట్వీట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు