వైరల్‌: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్‌!

24 May, 2021 10:06 IST|Sakshi

సాక్షి, చెన్నై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. జీవితంలో ఒకసారి జరిగే ఈ వేడుకను కుటంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. దీంతో వివాహాలకు కూడా పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కావాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది జంటలు తమ వివాహాన్ని మమ అంటూ జరిపించేస్తున్నారు. కానీ కోవిడ్‌యే కాదు ఏ మహమ్మారి వచ్చిన తమ పెళ్లిని ఆపలేవంటూ, అందరి సమక్షంలో ఓ జంట ఒకటయ్యింది. అయితే వీరి వివాహం నేల మీద జరగలేదు.. వినూత్నంగా గాల్లో అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి మదురై అమ్మవారిలో సన్నిధిలో మంగళవారం జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ విషయం తెలియడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్‌ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి ఒకటవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్‌

మరిన్ని వార్తలు