పాముకు నీళ్లు తాగించిన వ్యక్తి.. వీడియో వైరల్‌

23 Apr, 2021 13:21 IST|Sakshi

పాములంటే అందరికి చచ్చేంత భయం. వాటిని తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒకవేళ పాములు మన కంట పడితే.. ఇంకేమైనా ఉందా ఇక అక్కడి నుంచి పరుగున జారుకోవడమే. అదే ఆకలి విషయానికొస్తే మనుషులైనా, ప్రాణాంతక జంతువులు అయినా ఒకటే. తన నైజంను మరిచి ఆకలి దప్పికలను తీర్చుకునేందుకు ఆరాటపడుతుంటాయి. తాజాగా  ఓ వ్యక్తి పాము దగ్గరికి వెళ్లి మరీ దానికి నీళ్లు తాగించాడు. నమ్మడానికి కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా.. ఈ దృశ్యం తమిళనాడులో చోటుచేసుకుంది. కడలూరులోని అటవీ ప్రాంతంలో పాముకు ఓ వ్యక్తి నీళ్లు తాగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

‘వేసవిలో పాము దాహం తీర్చుతున్న ఓ మంచి మనిషి’ అంటూ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇందులో ఓ వ్యక్తి ఏమాత్రం భయపకుండా దాహంతో ఉన్న పాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి దగ్గరగా ఓ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. దాహంతో ఉన్న ఆ పాము వ్యక్తిని కాటేయాలని ప్రయత్నిస్తూనే మరోవైపు నీటిని తాగేసింది. అంతేగాక అతను పాము కోసం నీటిని నేలపై పోసి తాగించాడు. అనంతరం పామును జాగ్రత్తగా అడవిలో వదిలేశాడు. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

చదవండి: ఎస్కలేటర్‌ మీదనుంచి అరుపులు.. ఠక్కున పరిగెత్తి..

మరిన్ని వార్తలు