Viral Video: వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు

22 Jun, 2022 21:18 IST|Sakshi

రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా మంది ఇష్టం వచ్చినట్లు డ్రైవ్‌ చేస్తుంటారు. సిగ్నల్స్‌ పట్టించుకోకుండా రయ్యిమంటూ దూసుకెళ్తుంటారు. బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ అతివేగంగా వెళ్తుంటారు. పరిమితికి మించి లగేజ్‌ను తీసుకెళ్తుంటారు. ఇలాంటివారు తమ జీవితాన్నే నాశనం చేసుకోకుండా వేరే వాళ్ల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై ఇలాగే వెళ్తూ కనిపించాడు. తన టూవీలర్‌పై పరిమితికి మించి అధిక బరువులను తీసుకెళ్తున్నాడు. 

స్కూటీపై కనీసం తను కూడా కూర్చోడానికి ప్లేస్‌ లేకుండా వస్తువులతో నింపేసి.. బండి చివర కూర్చొని ప్రమాదకరంగా డ్రైవ్‌ చేస్తున్నాడు. అతని కాళ్లు కిందకు ఆనుతుంటే.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సాగర్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘నా 32GB ఫోన్ 31.9 GB డేటాను తీసుకువెళుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. ఇందులోని వ్యక్తి  ఎవరో.. ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ  వీడియో మాత్రం వైరల్‌గా మారింది.   

దీనిని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు. దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ..‘మొబైల్‌ దెబ్బతిన్నప్పటికీ డాటా రికవరీ చేయవచ్చు కానీ జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను కూడా ప్రమాదంలో పడకుండా నివారించండి’ అంటూ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.

ఈ వీడియోను ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతని డ్రైవింగ్‌ భయంకరంగా ఉంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు. అతనికి భారీ జరిమానా విధించండి.’ అంటూ తిట్టిపోస్తున్నారు. 

మరిన్ని వార్తలు