భయంకర దృశ్యాలు.. డ్రైవర్‌ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో

16 Nov, 2022 11:51 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో భయంకర ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉండే రహదారిపై వేగంగా ఆటో నుంచి ఓ మైనర్‌ బాలిక అకస్మికంగా రోడ్డు మీదకు దూకింది. డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైనర్‌ ఆటోలో నుంచి కిందకు దూకినట్లు తేలింది. ఈ ప్రమాదంలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక ఆటో నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డు పక్కనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

సీసీటీవీ ఫుటేజీలో రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటోరిక్షా నుంచి రోడ్డుపై పడినట్లు కనిపిస్తోంది. వెంటనే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బాలికను రక్షించేందుకు వచ్చాడు.  మిగతా వారిని సాయం చేయాలని కోరుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరో వ్యక్తి తన షాపు నుంచి వాటర్ బాటిల్‌తో బయటకు వచ్చి బాధితురాలికి అందివ్వడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు

మరిన్ని వార్తలు