కాంగ్రెస్‌ నాయకుడి జుట్టు పట్టుకొని లాగిన ఢిల్లీ పోలీసులు.. వైరల్‌ వీడియో

26 Jul, 2022 18:57 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఈడీ మంగళవారం రెండోసారి విచారించింది. సోనియాపై ఈడీని ప్రయోగించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈడీ దర్యాప్తుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాహుల్‌ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో విజయ్‌ చైక్‌ వద్ద ధర్నాకు దిగారు. దీంతో రాహుల్‌ గాంధీ సహా 18 మంది కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాసుపై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి తోసేశారు పోలీసులు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి నెట్టేశారు. అయినా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు ర్యాపిడ్‌ యాక్షన్‌ పోర్స్‌ సిబ్బంది కాంగ్రెస్‌ నేత మెడ పట్టుకొని కారులో కూర్చొబెట్టారు.

అంతేగాక శ్రీనివాస్‌ కారులో ఉండగా ఎటు కదలకుండా ఉండేందుకు పోలీసులు అతని కాళ్లు, చేతులు, గొంతు పట్టుకున్నారు. ఈ దృశ్యాలన్నింటినీ అక్కడున్న వారు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కాంగ్రెస్‌ నాయకుడిపై అనుచితంగా ప్రమర్తించిన పోలీసు సిబ్బందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. తర్వాత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు