Viral Video: బ్యాంక్‌ దోపిడికొచ్చిన దొంగలతో వీరోచితంగా పోరాడిన మహిళా కానిస్టేబుళ్లు

19 Jan, 2023 13:14 IST|Sakshi

బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో వీరోచితంగా పోరాడారు ఇద్దరు మహిళా పోలీస్‌ కానిస్టేబుళ్లు.. దొంగల పట్ల మహిళలు చూపిన ధైర్యం, తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సెందూరి చౌక్‌లో ఉన్న ఉత్తర్‌ బిహార్‌ గ్రామీణ బ్యాంక్‌ వద్ద బ్యాంక్‌ వద్ద  జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. 

వాళ్ల ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఏ పనిమీద వచ్చారని జుహీ ప్రశ్నించింది. దీనికి వారు బ్యాంక్‌లో పని ఉందని చెప్పగా.. పాస్‌బుక్‌ చూపించమని అడిగింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి  రివాల్వర్‌ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు కానిస్టేబుళ్లు తమ తుపాకులతో వారిని నిలవురించారు. కానిస్టేబుళ్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కోవడానికి దొంగల విఫల ప్రయత్నం చేశారు. దొంగల చేతిలో గన్‌ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. మహిళలిద్దరూ ముగ్గురు దుండగులపై సాహోసోపేతంగా పోరాడారు.

అప్పటికే బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్‌ అయ్యింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్యాంక్‌ దోపిడికి ప్రయత్నించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారని.. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని..  కానిస్టేబుళ్లకు రివార్డ్ అందిస్తామని పేర్కొన్నారు.
చదవండి: దారుణం.. బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా..

మరిన్ని వార్తలు