వైరల్‌: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’

9 Jul, 2021 11:28 IST|Sakshi

చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్‌ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒక‌వేళ నీటిలో దిగితే త‌న ఖ‌రీదైన బూట్లు, పంచె పాడ‌వుతాయ‌ని భావించి అలాగే కూర్చున్నారు. 

దీంతో అక్క‌డున్న మ‌త్స్య‌కారులు ఆయ‌న‌ను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు