ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు!

16 Jun, 2021 18:22 IST|Sakshi

పెళ్లిమంటపంలో ఉండే సందడే వేరు. వధూవరుల కుటుంబాలు, బంధువులు, స్నేహితుల రాకతో.. తోరణాలతో పచ్చని పందిరి కళకళలాడుతూ ఉంటుంది. ఓ పక్క పెళ్లి తంతు జరుగుతుండగా ఆడపడుచుల ముచ్చట్లు.. మరోపక్క విందు భోజనాలు.. అబ్బో ఆ కళే వేరు. ఇక ఈ జ్ఞాపకాలన్నింటినీ పదికాలాల పాటు పదిలపరచుకునేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సేవలు వినియోగించుకోవడం సహజమే. అయితే, ఇటీవల కాలంలో శ్రుతిమీరి మరీ వీరు చేస్తున్న ఫీట్లు ఒక్కోసారి విమర్శలకు దారితీస్తున్నాయి.

ముఖ్యంగా ఫొటోలు తీసే సమయంలో పెళ్లికూతురి పట్ల వారి ప్రవర్తనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తోంది. అయితే, ఇది వధువు కాకుండా పెళ్లికి వచ్చిన ఓ అతిథికి సంబంధించిన వీడియో. పళ్లెంలో బిర్యానీ పెట్టుకుని, దాని రుచిని ఆస్వాదించేందుకు ఓ మహిళ.. చేతితో ముద్ద నోట్లో పెట్టుకునేందుకు సిద్ధమవుతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన వీడియోగ్రాఫర్‌ ఈ దృశ్యాన్ని బంధించేందుకు ఉపక్రమిస్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె... స్పూన్‌తో బిర్యానీ తింటూ కెమెరా వైపు దృష్టిసారిస్తుంది. 

ఇదంతా స్క్రిప్టెడ్‌ అని అనిపిస్తున్నా... ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ఎక్కడి నుంచి దాపురించాడు. ఆ వీడియోగ్రాఫర్‌ను తోసేసి.. కెమెరాను నెట్టేసి.. హాయిగా చేతితోనే తినాల్సింది సిస్టర్‌’’ అంటూ కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘వీడియో తీస్తున్నంత మాత్రాన స్పూన్‌ పట్టుకోవాలా. చేతితో తినేందుకు సిగ్గు పడటం ఎందుకో’’ అని విమర్శిస్తున్నారు. ఇంకొంత మందేమో.. సరదాగా తీసిన ఈ వీడియోను అంతే సరదాగా చూడండి అంటూ హితబోధ చేస్తున్నారు.

చదవండి: ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు