పోలీసుల సాయంతో పెళ్లి ఆపిన వధువు.. కారణం ఏంటంటే?

26 Jul, 2021 20:10 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మరో గంటలో వధువు మెడలో మూడు మూళ్లు పడతాయన్న సమయంలో పోలీసులు ఎంట్రీ  ఇచ్చి వివాహాన్ని రద్దు చేశారు. అయితే స్వయనా వధువే పోలీసులకు సమాచారమిచ్చి పచ్చని పందింట్లో తన పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, మరి ఆమె ఎందుకిలా చేసిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని పుజల్‌ ప్రాంతానికి చెందిన జనతుల్లా ఫిర్డోస్ అనే 22 ఏళ్ల యువతికి తన మేనమామతో కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి నిశ్చయించారు.

అయితే ఆ వివాహం ఆమెకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం ఎంత చెప్పిన వినిపించుకోలేదు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి జరిగే రోజున వధువు, వరుడు మండపం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే ఏం చేయాలో తోచని వధువు ఓ వీడియోను రూపొందించి తన స్నేహితులకు పంపించి.. పోలీసులకు ఫార్వర్డ్‌ చేయాలని కోరింది. ‘నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. బలవంతంగా మేనమామతో పెళ్లి నిశ్చయించారు. అతనికి వేరే మహిళలతో సంబంధం ఉంది. అతనితో పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అవుతుంది. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను’ అని వీడియోలో పేర్కొంది.

దీన్ని వధువు స్నేహితులు జల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల బృందం మండపం వద్దకు చేరుకొని పెళ్లి ఆపేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారు ఎంత చెప్పిన వినకపోవడంతో వధువు తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మరో గంటలో మూడు మూళ్లు పడతాయన్న సమయంలో వివాహన్ని క్యాన్సిల్‌ చేశారు. అలాగే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దని ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ చేశారు. వధువు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకున్న పోలీసులు.. తల్లిదండ్రులు మరోసారి వత్తిడి చేస్తే తమను సంప్రదించాలని సూచించి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు