'సెకండ్‌ వేవ్‌ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది'

12 May, 2021 02:28 IST|Sakshi

ప్రముఖ వైరాలజిస్ట్‌ జమీల్‌ అంచనా  

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించినట్లు కనిపిస్తోందని, అయితే, పూర్తిగా కిందకు దిగిరావడానికి మరింత సమయం పడుతుందని ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహీద్‌ జమీల్‌ పేర్కొన్నారు. రెండో వేవ్‌ ప్రభావం జూలై వరకు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొంతవరకు కొత్త వేరియంట్లు కారణం కావచ్చన్నారు. కానీ, ఈ అనువర్తిత వేరియంట్లు మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లేవన్నారు. జమీల్‌ ప్రస్తుతం అశోక యూనివర్సిటీలో త్రివేదీ స్కూల్‌ ఆఫ్‌ బయోసైన్సెస్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రెండో వేవ్‌ అత్యంత తీవ్ర స్థాయికి చేరిందని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని జమీల్‌ పేర్కొన్నారు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సంస్థ మంగళవారం నిర్వ హించిన ఒక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో వైరాలజిస్ట్‌ జమీల్‌ పాల్గొన్నారు.

రెండో వేవ్‌లో కేసుల సంఖ్యలో తగ్గుదల కూడా మొదటి వేవ్‌ తరహాలో క్రమ పద్దతిలో ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కోవిడ్‌ మరణాల డేటా కూడా తప్పేనని, అది ఎవరో కావాలని చేస్తోంది కాదని, మరణాలను గణించే విధానమే లోపభూయిష్టంగా ఉందని వివరించారు. డిసెంబర్‌ నాటికి కేసుల సంఖ్య భారీగా తగ్గిందని, దాంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని వివరించారు. పెళ్లిళ్లు, ఎన్నికల ర్యాలీ లు, మత కార్యక్రమాలు వైరస్‌ వ్యాప్తిని పెంచాయన్నారు. టీకాల వల్ల దుష్పరిమాణాలు వస్తాయన్న వార్తలు ప్రజలను భయపెట్టాయని, వ్యాక్సిన్లు సురక్షితమైనవని స్పష్టం చేశారు. చాలా దేశాలు చాలా ముందుగానే, ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను బుక్‌ చేసుకోగా.. భారత్‌ ఆ విషయంలో వెనుకబడిందన్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేందుకు జనాభాలో కనీసం 75% మందికి ఇన్‌ఫెక్షన్‌ రావడం కానీ, వ్యాక్సిన్‌ ఇవ్వడం కానీ జరగాలన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు