లవ్‌ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు

2 Dec, 2022 05:49 IST|Sakshi

దేశవ్యాప్తంగా జనచేతన కార్యక్రమం

న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్‌ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్‌ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్‌ జాగ్రణ్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.

ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్‌రంగ్‌ దళ్‌ పదో తేదీ దాకా బ్లాక్‌ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్‌ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్‌ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. 

మరిన్ని వార్తలు