అయోధ్య భూమి పూజ: విశ్వ హిందూ పరిషత్‌ ప్రకటన

4 Aug, 2020 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏ రకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది.  దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను విశ్వ హిందూ పరిషత్‌ విడుదల చేసింది. అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవం ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని దానిలో వివరించారు.  దీని ప్రకారం ఆగష్టు 5 వ తేదీ(బుధవారం) ప్రధాని నరేంద్రమోదీ సాధు సంతులు, వేద పండితులు, ట్రష్టు సభ్యులు, ఇతర విశిష్ట అతిధులతో కలిసి రామ జన్మభూమిలో శ్రీరామునికి విశేషమైన పూజలు చేస్తారు. ఈ చారిత్రకమైన ఘట్టాన్ని మొత్తం భారతదేశమే కాక యావత్  ప్రపంచం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

దేశం నలుమూలలలోని పవిత్ర నదులనుంచి సేకరించిన జలాలను, పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మృత్తికను ఈ పూజా కార్యక్రమంలో వినియోగించనున్నారు. 2020 ఆగష్టు 5 బుధవారం రోజున ఉదయం 10.30 గంటలకు సాధుసంతులు వారి వారి పీఠాల్లో, ఆశ్రమాల్లో, దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ వారి వారి గృహాల్లో లేదా వారికి దగ్గరలో ఉండే దేవాలయాల్లో,  ఆశ్రమాల్లో కలిసి కూర్చుని వారి వారి ఇష్ట దేవతల భజన, కీర్తన, జపము, అర్చనలు చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చెయ్యాలని  విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే రామ భక్తులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉంటే అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమం టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తున్న సమయంలో  చుట్టుప్రక్కల వారందరూ కలిసి వీక్షించే విధంగా ఆడిటోరియంలో గాని, హాల్ లో గాని పెద్ద తెరను ఏర్పాటు చేసుకుని వీక్షించే ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా  ఇళ్ళను, ఆశ్రమాలను, పీఠాలను వీలైనంత అందంగా ఉండేటట్లు అలంకరణ చేసి అందరికి ప్రసాద వితరణ చెయ్యండి అని ఆయన విన్నవించారు. అదేవిధంగా  సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి అని రామ భక్తులను కోరారు. రామమందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉండేందుకు ఎంతవరకు విరాళం ఇవ్వగలరో అంత ఇవ్వడానికి సంకల్పం చెయ్యండి అని అన్నారు.

ప్రస్థుత పరిస్థితిలో భక్తులు అయోధ్య రావటం చాలా కష్ట సాధ్యమైనందున ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి అని పిలుపునిచ్చారు.  అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నిటినీ అధికంగా  ఉపయోగించుకొని ఈ విశేష కార్యక్రమంలో సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడండి అన్ని  కోరారు. పైన పేర్కొన్న వివిధ రకాలైన పద్దతులలో కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వము, స్థానిక అధికారులు విధించిన నియమాలను అందరూ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని  మిలింద్ పరాండే సూచించారు. 

చదవండి: భూమి పూజ‌కు ముహూర్తం..పూజారికి బెదిరింపు కాల్స్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా