ది కేరళ స్టోరీపై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్‌.. 

9 May, 2023 16:23 IST|Sakshi

ముంబై: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలోకి ఇటీవలే విడులైన ది కేరళ స్టోరీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్‌ చేశాయి. 

ఇక, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ సినిమాను బ్యాన్‌ చేసింది తృణముల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్‌ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన​్‌ చేసినట్టు తెలిపారు. 

కాగా, మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి సీరియస్‌ అయ్యారు. దీంతో, మమతకు లీగల్‌ నోటీస్‌ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్‌ నోటీస్‌ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్‌లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు.

ఇది కూడా చదవండి: The Kerala Story: యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు