-

కరోనాతో చిన్నమ్మ పోరాటం

23 Jan, 2021 06:53 IST|Sakshi

బెంగళూరు జైలులో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రి పాలైన చిన్నమ్మ కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలు బయటపడడంతో శశికళ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. 

సాక్షి,చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఈనెల 27న ఆమె విడుదల కావాల్సిన తరుణంలో అస్వస్థకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈనెల 20న బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆమెకు వెంటిలేటర్‌ అమర్చి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఇప్పటికే బీపీ, షుగర్‌ ఉండడంతో వైద్యులు దగ్గరుండి తరచూ పరీక్షిస్తున్నారు. శశికళకు గురువారం రాత్రి జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో రక్తపరీక్షలు చేయగా తీవ్రమైన నిమోనియా వ్యాధి ఉన్నట్లు తేలింది.

ఆమెను ఉంచిన వార్డులు నిరంతర ప్రాతిపదికపై వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందిని నియమించారు. ఈనెల 24వ తేదీ వరకు ఆస్పత్రిలోనే ఆమెను ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు వ్యాధులకు గురికావడంతో బెంగళూరుకు చేరుకున్న చిన్నమ్మ బంధువులు ఆందోళన చెందుతున్నారు. టీటీవీ దినకరన్‌ను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి వెలుపల పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు చేరుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. శశికళ ఉంటున్న జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇళవరసికి సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు.  

విడుదలలో జాప్యం.. 
శశికళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కనీసం 15 రోజులు ఐసోలేషన్‌లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు తోడు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఈనెల 27న శశికళ విడుదల కాకపోవచ్చని అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు డీలా పడిపోయారు. 27న శశికళ విడుదల కాగానే కర్ణాటక నుంచి తమిళనాడు వరకు కార్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆమె ఎప్పుడు విడుదలవుతారో ఎవరూ నిర్ధారించలేని పరిస్థితులు చుట్టుముట్టాయి.  దీనిపై అధికారులు మాట్లాడుతూ విడుదలకు ముందు ఆమె జైలు దుస్తులు తమకు అప్పగించి, రికార్డుల్లో సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కరోనా సోకినందున అది సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో శశికళ విడుదల గురించి తీసుకోవాల్సిన నిర్ణయంపై చట్ట నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు