చిన్నమ్మ రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు 

19 Nov, 2020 06:59 IST|Sakshi

శశికళ విడుదల ఖాయం 

పరప్పన అగ్రహార చెరకు రశీదులు 

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆమె చెల్లించాల్సిన రూ.10 కోట్ల పది లక్షల జరిమానాను కోర్టుకు చెల్లించారు. రశీదులను పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ న్యాయవాదులు పంపించినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో శశికళ విడుదల కాబోతున్నట్టు విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె విడుదల అవుతారన్న సమాచారంతో అన్నాడీఎంకేలో చర్చ తప్పలేదు. అదే సమయంలో చిన్నమ్మ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు సైతం సాగుతున్నట్టుగా చర్చ జోరందుకుంది.  అదేసమయంలో ఆమె తరఫు న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌ అయితే, చిన్నమ్మ విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ముందుగానే ఆమె జైలు నుంచి బయటకు వస్తారన్న  ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చదవండి: రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ

జరిమానా చెల్లింపు.. 
ఆదివారం బెంగళూరుకు వెళ్లిన రాజా చెందూర్‌ పాండియన్‌ చిన్నమ్మకు కోర్టు విధించిన జరిమానా చెల్లింపు పనిలో పడ్డారు. బెంగళూరులోని న్యాయ వాది ముత్తుకుమార్‌తో కలిసి రూ.10 కోట్ల 10 లక్షలను మంగళవారం సంబంధిత కోర్టులో చెల్లించారు. డీడీ రూపంలో న్యాయమూర్తి అందుకున్నారు. రశీదు బుధవారం ఉదయాన్నే ఆ కోర్టు నుంచి చిన్నమ్మ న్యాయవాదులు అందుకున్నట్టు తెలిసింది. శశికళ విడుదల విషయంగా తమ తరఫు లేఖను పరప్పన అగ్రహారచెరకు పంపించినట్టు తెలిసింది.

రాజాచెందూర్‌ పాండియన్‌ను ప్రశ్నించగా, అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యేందుకు సైతం అవకాశాలు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అనుభవించిన జైలు జీవితం మేరకు ఆమె ముందుగానే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువేనని ధీమా వ్యక్తం చేశారు. శశికళ విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరి ణామాలు చోటుచేసుకునే ప్రసక్తే లేదని కోవైలో మీడియాతో సీఎం ఎడపాడి మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు.
   

మరిన్ని వార్తలు