నేడు చెన్నైకి శశికళ.. ఘనంగా స్వాగత ఏర్పాట్లు

8 Feb, 2021 00:50 IST|Sakshi

ఘన స్వాగతానికి ఏర్పాట్లు 

నిఘా వలయంలో అన్నాడీఎంకే కార్యాలయం

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ సోమవారం చెన్నైకు రానున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లు చేశాయి. చిన్నమ్మ వస్తే అడ్డుకొనేందుకు అన్నాడీఎంకే కార్యాలయం, మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకుని సోమవారం చెన్నైకు శశికళ రానున్నారు.

టీనగర్‌ హబీబుల్లా రోడ్డులో ఆమె బస చేయడానికి తగ్గట్టుగా ఓ భవనం సిద్ధమైంది. ఇది ఆమె వదినమ్మ ఇలవరసి కుటుంబానికి చెందింది. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. దీంతో ఆయా జిల్లాల్లో 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు జరిగాయి. అన్నాడీఎంకే జెండా కల్గిన కారులోనే ఆమె రానున్నట్టు సమాచారం వెలువడింది. శశికళకు భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి  దినకరన్‌ తరఫున ఓ విజ్ఞప్తి ఆదివారం కమిషనరేట్‌కు చేరింది.

శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన పక్షంలో ఆమెను అడ్డుకునేందుకు అధికార పక్షం ముందస్తు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని నిఘా వలయంలోకి  తీసుకొచ్చారు. అలాగే, జయలలిత సమాధి సందర్శనకు అనుమతి రద్దు చేసిన దృష్ట్యా, శశికళ వెళ్లిన పక్షంలో అక్కడ కూడా అడ్డుకునేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు