బీజేపీ విజయం తథ్యం: సీఎం చౌహాన్

4 Nov, 2020 12:01 IST|Sakshi

ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా

ప్రజలు ధైర్యంగా ఓటు వేశారని కితాబు

భోపాల్‌: ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మంగళవారం 28 అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఓటింగ్‌ జరిగిందని, బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వెంటాడుతున్నా మధ్యప్రదేశ్‌ ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఇది మన ప్రజాస్వామ్యం గొప్పదనమని చౌహాన్‌ తెలిపారు. ఓటర్లు అందరూ తమ ఓటును ఉత్సాహంగా బీజేపీకే వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడి 22 మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటితో పాటు ఇది వరకు ఖాళీగా ఉన్న సీట్లను కలిపి 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభత్వం కూలిపోయి, శివరాజ్‌ సింగ్ చౌహాన్‌‌ సీఎం అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, నిరుద్యోగులను, మహిళలను, కమల్‌నాథ్‌ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు సింధియా తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో 57.09 శాతం పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా అగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 80.46 శాతం ఓటింగ్‌ నమోదైంది. సుమవలి నియోజకవర్గంలో అత్యల్పంగా 41.79 శాతంగా ఓటింగ్ జరిగిందని ఎలక్షన్‌ కమిషన్‌ పేర్కొంది. బిహార్‌ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలతో పాటు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న వెల్లడించనున్నారు. వీటిలో కనీసం తొమ్మిది స్థానాలు గెలిస్తేనే శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం నిలువనుంది. మెజారిటీ కొంచెం అటు ఇటు అయితే మళ్లీ కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టొచ్చు.

మరిన్ని వార్తలు