యూఎస్‌ వీసా కోసం నిరీక్షణ తప్పదు

1 Nov, 2021 04:54 IST|Sakshi

అమెరికా రాయబార కార్యాలయం వెల్లడి  

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: విదేశీ ప్రయాణికులపై కోవిడ్‌–19 ఆంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వలసేతర వీసా కేటగిరీలో ఈ నిరీక్షణ తప్పదని పేర్కొంది.

నవంబర్‌ 8 నుంచి అమెరికా ప్రయాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘కోవిడ్‌ వల్ల ఏర్పడిన అంతరాయం నుంచి ఇప్పుడే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. అందువల్ల రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాల్లో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులు జరిగేలా చూస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాం’’అని పేర్కొంది. రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికులు భద్రంగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తూ వీసా మంజూరు ప్రక్రియని వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది.

లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్‌ ఎంబసీల నుంచి అపాయింట్‌మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్‌ వెళ్లేందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్‌ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయిటింగ్‌ లిస్టు చాంతాడంత ఉందని, ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వెంటనే యూఎస్‌ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు